ది లాస్ట్‌ జర్నీ

ఆస్తిపాస్తులు, సంపాదన, స్టేటస్‌ కోసం పరదేశాలకు ఉపాధి పేరిట వలస వెళ్లి తల్లిదండ్రులు ధారపోసిన విద్యాజ్ఞానాన్ని లక్షల రూపాయల సంపాదన కోసం ధారపోస్తున్న యువతకు, ప్రస్తుత భారతీయ సమాజంలో కని, పెంచి పెద్దజేసిన తల్లిదండ్రుల పట్ల తమ సంతానం అనుసరిస్తున్న వైఖరికి నిదర్శనంగా ఈ కథానిక రచయిత తడకమళ్ళ మురళీధర్‌ రావు కలం నుండి వెలువడింది. అంతేగాక కర్మను అధిగమించలేమన్న భారతీయ నానుడికి, విశ్వాసానికి సరిగ్గా అన్వయించబడింది. అన్ని హంగులను కలిగి ఉండి జీవితపు చివరి క్షణాల్లోను వాటిని ఏ మాత్రం సంతృప్తిగా అనుభవించలేని, పొందలేని తల్లిదండ్రులు, తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేని సంతానం ఈ కలికాలంలో ఎందరో ఉన్నారు. వారందరికి రిటైర్డ్‌ సెషన్స్‌ జడ్జి, మా రచయిత తడకమళ్ళ మురళీధర్‌ రావు గారు వెలువరిస్తున్నఈ కథానిక కొంత మేరకైన కనువిప్పు కలిగించి భారతీయ సమాజంలో జరుగుతున్న ఇలాంటి సంఘటనలకు పుల్‌ష్టాప్‌ పెడుతుందని మా చిగురాశ.

‘‘రాజేందర్‌, ఎలా వున్నారు మీరు’’ ముక్కుకు, మూతికి ఉన్న మాస్కును సవరించుకుంటూ అడిగాడు శ్రీరామ్‌. ‘‘కరోనా వైరస్‌ పుణ్యమాని మా కుటుంబ సభ్యులమంతా బాగానే వున్నాము శ్రీరామ్‌’’ అంటూ మూతికి ఉన్నటువంటి మాస్కు వెనుక నుండి జవాబిచ్చాడు రాజేందర్‌. రాజేందర్‌, శ్రీరామ్‌ ఇద్దరివి ప్రక్క ప్రక్క ఇండ్లు. రెండు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వ సర్వీసు నుండి రిటైర్‌ అయి ఇంటి దగ్గరే కాలక్షేపం చేస్తున్నారు. ప్రతి రోజు సాయంత్రం ఇద్దరు కలిసి దగ్గరలో ఉన్నటువంటి ప్రియదర్శిని పార్కుకు వాకింగ్‌ చేయడం, కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకోవటం, దేశ ఆర్థిక వ్యవస్థ, ఆరు నెలలకో సారి ప్రభుత్వం ఇచ్చే కరువు భత్యం, ప్రధాని, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది లాంటి విషయాలు చర్చించడం, తిరిగి ఇంటికి రావడం వారి దినచర్యలో భాగం. లాక్‌ డౌన్‌ మూలాన ఇరవై రోజులుగా వారి దినచర్యకు కట్టడి పడి ఇంటి నుండి కదలడం లేదు. ఇరవై రోజుల తర్వాత మొదటి సారి వారిరువురు ప్రక్క వీధిలో ఉన్నటువంటి ఏటిఎం సెంటర్‌ దగ్గర కలుసుకున్నారు. ‘‘ఇంటి దగ్గరే వున్నారా లేక ఈ మధ్య ఎటైనా బైటికి వెళ్ళారా శ్రీరామ్‌’’ అంటూ రాజేందర్‌ సంభాషణ కొనసాగించాడు. ‘‘మూడు రోజుల క్రితం పోస్టు ఆఫీసు వీధిలో ఉన్నటువంటి డాక్టర్‌ రామనాధం భార్య సుశీలమ్మ గారు కాలం చేశారని తెలిస్తే వారింటికి వెళ్ళాను. డాక్టర్‌ రామనాధం గారు దాదాపు ఇరవై సంవత్సరాలుగా మా ఫ్యామిలీ డాక్టరనే విషయం మీకు తెలుసుగా’’. ‘‘అయ్యో నాకు తెలియక పోవటమేమిటి. ఆయన భార్య కాలం చేశారా! కరోనా వైరస్‌ ప్రభావమా లేక మామూలుగానే పోయారా’’. ‘‘గత మూడు సంవత్సరాల నుండి ఆవిడ కాన్సర్‌ జబ్బుతో బాధపడుతున్నారు, భార్య జబ్బుతో అంత బాధలో ఉన్ననూ మేము ఎప్పుడు వెళ్ళినా డాక్టర్‌ రామనాధం గారు ఎంతో ఓపిగ్గా పలకరించే వారు. మంచి మందులు రాసే వారు, హస్తవాసి ఉన్న డాక్టర్‌ అని చెప్పవచ్చు. ఇద్దరు కూడా దైవ భక్తి, పాప భీతి వున్నవారు. ఆవిడైతే ప్రతి రోజు మినిమం అర్థగంట పూజ చేసేవారు.’’ ‘‘ఎంత వయస్సు వుంటుంది ఆవిడకి’’ అడిగాడు రాజేందర్‌. ‘‘దాదాపు 70 సంవత్సరాలు వుంటాయి. పాపం రామనాధం గారు పిల్లలు వుండి భార్య మరణంతో ఏకాకి అయినారని చెప్పవచ్చు. ఆ రోజుల్లోనే వారిరువురు ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో పెళ్ళి చేసు కున్నారట. డాక్టరు వృత్తి ద్వారా డబ్బు, ఆస్తులు బాగానే సంపాదించారు. ఇద్దరు కొడుకులను ఇంజినీరింగ్‌ చదివించారు, ఇద్దరి పెళ్ళిళ్ళు ఇక్కడే చేశారు. వయస్సు పెరిగే కొద్దీ శరీరం సహకరించదు కదా. ఇంతకు ముందు లాగా రామనాధం గారు యాక్టివుగా లేరు. దానికి తోడు ఇప్పుడు భార్యా వియోగము, ఉన్న ఇద్దరు కొడుకులు అమెరికాలో సాఫ్టువేర్‌ ఇంజనీర్లు. చాలా ఏండ్ల క్రితమే అక్కడ స్థిరపడ్డారు’’. ‘‘మరి ఇద్దరు కొడుకులు అమెరికాలో వుంటే అంత్యక్రియలు ఎవరు జరిపారు’’ ప్రశ్నించాడు రాజేందర్‌. ‘‘లాక్‌ డౌన్‌ మూలాన దేశీయ, అంతర్జాతీయ విమానాలు పూర్తిగా రద్దు చేశారు కదా, దానితో కొడుకు, కోడళ్ళు, మనమలు, మనవరాళ్లు అమెరికా నుండి రాలేని పరిస్థితి. సుశీలమ్మ గారు చనిపోవడానికి కొద్ది నెలల ముందు ఇంట్లో ఫుల్‌ టైమ్‌ అటెండెంట్‌ ను కూడా రామనాధం గారు నియమించారు.’’ ‘‘ఇటువంటి సమయంలో కన్న కొడుకు, కన్న కూతురు అందుబాటులో లేకుండా , అంత్య క్రియలు జరిపే వారు లేకుంటే తండ్రి మనస్సు ఎంత ఘోషిస్తుందో.’’ జాలి వ్యక్తపరిచాడు రాజేందర్‌. ‘‘చని పోవటానికి ముందు రాత్రి పది గంటలకు స్కైప్‌ ద్వారా అమెరికాలో వున్న కొడుకుతో సుశీలమ్మ గారు మాట్లాడి పడుకున్నారట. అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో రామనాధం గారు లేచి చూస్తే ఉలుకు పలుకు లేదట. నిద్రలోనే బెడ్‌ రూములో చివరి శ్వాస విడిచినట్లు తెలిసింది. ఆ సమయంలో రామనాధం గారు ఒక్కడే ఇంట్లో ఉన్నాడు, ఆయన డాక్టర్‌ కాబట్టి ప్రాణం పోయిన విషయం గ్రహించాడు. వారి దురదృష్టం కొద్దీ అటెండెంట్‌ కూడా అందుబాటులో లేడు. లాక్‌ డౌన్‌ మూలాన స్వంత ఊరుకు వెళ్లినాడట. డెడ్‌ బాడీని ముందు రూములో పెట్టాలంటే తెల్లవారే దాకా ఎవరూ ఆయనకు అందుబాటులో లేరు. భార్య మరణం తట్టుకోలేక ఏమి తోచక తెల్లవారే దాకా ఏడుస్తు కూర్చున్నాడు. వెంటనే ఇక్కడ వున్న బంధువులకు ఫోను చేయాలనే ఆలోచన కూడా ఆయనకు రాలేదు. పూర్తిగా తెల్లవారిన తర్వాత కాస్త తేరుకొని బంధువులకు, కొడుకులకు ఫోను చేశాడు. కొడుకు, కోడళ్ళు అమెరికా నుండి ఉన్న పళంగా రాలేని పరిస్థితి. నాకు ఉదయం ఎనిమిది గంటలకు చావు వార్త తెలిసింది. వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలో కాసేపు వుండి ఏమైతే అయిందిలే అని మాస్క్‌ మరియు గ్లోవ్స్‌ వేసుకుని వెళ్ళాను. ఎందుకంటే కరోనా వైరస్‌ వల్ల మన భయం మనకు. నేను వెళ్ళేటప్పటికి బంధువర్గం నుండి ఇద్దరు స్త్రీలు, ఇద్దరు మగవారు మాత్రమే వున్నారు. వారంతా అరవై యేండ్ల పై బడిన వారే. శవాన్ని ముందు రూములో పండ బెట్టారు. రామనాధం గారిని చూడగానే ఏడుపు ఆపుకోలేక పోయాను. సుశీలమ్మ గారి నుదుట పెద్ద సైజు బొట్టుతో ముఖంలో ఏ మాత్రం కళాకాంతులు తగ్గలేదు. ఆవిడ పాదాలకు నమస్కరించి ముఖానికి వున్న మాస్కును సవరించుకొని రామనాధం గారి ప్రక్కన నిలుచున్నాను. లాక్‌ డౌన్‌ లో కూడా ప్రతి రోజు కీమో థెరపీ చేయించడానికి తనే స్వయంగా హాస్పిటల్‌ కి తీసుక వెళ్ళానని, రాత్రి పడుకునే వరకు కూడా ఉల్లాసం గానే ఉందని, తనను ఒంటరి చేసి వెళ్తుందని అనుకోలేదని, ఉబికి వస్తున్న ఏడుపును అణచుకొంటూ రామనాధం గారు చెప్పారు. వారిని ఊరడిస్తున్నట్లు వారి భుజంపై చేత్తో తట్టాను.’’ చెప్తున్న శ్రీరామ్‌ కాసేపు ఆగాడు.

‘‘వెరీ బ్యాడ్‌ లక్‌. శ్మశానానికి శవాన్ని ఎలా తీసుక వెళ్లారు’’ ప్రశ్నించాడు రాజేందర్‌. ‘‘వచ్చిన ఒక బంధువు తనకు తెలిసిన పంతులు గారికి ఫోను చేస్తే వస్తానని అన్నాడట. అతనే వైకుంఠ రథం ఏర్పాటు, శ్మశానంలో మిగతా ఏర్పాట్లు చూసుకుంటానని మొత్తం ప్యాకేజి క్రింద ఓ ముప్పై వేల రూపాయలకు ఒప్పుకున్నాడట.’’ ‘‘డబ్బు విషయం కాదు కానీ లాక్‌ డౌన్‌ లో పంతులు గారి సేవలు దొరకడం నిజంగా అదృష్టం. వాళ్లకి కూడా ఈ పరిస్థితుల్లో బయటకు రావాలంటే భయం వుంటుంది కదా. కరోనా మహమ్మారి ఎవరి నుండి ఎవరికి అంటుతుందో ఊహించలేము. మీరు కూడా ధైర్యం చేసి ఈ వయసులో పలకరించడానికి కరోనాను లెక్క చెయ్యకుండా వెళ్లారు.’’ అన్నాడు రాజేందర్‌. ‘‘పురోహితుడు పన్నెండు గంటలకు అంత్య క్రియలకు అవసరమయ్యే సామానుతో వచ్చి, తల కొరివి ఎవరు పెడతారు అని అడిగాడు. ఇద్దరు కొడుకులు అమెరికాలో వున్నారు వారు వచ్చే అవకాశం లేనందున తానే పెడతానని రామనాధం గారు చెప్పారు. కొడుకు ఉన్నారు కాబట్టి భర్త భార్య తల కొరివి పెట్టడానికి శాస్త్రం ఒప్పుకోదని కొడుకు వరుస వారు ఎవరైనా పెట్ట వచ్చని పంతులు గారు చల్లని కబురు చెప్పటంతో రామనాధం గారు సందిగ్ధంలో పడ్డారు. కొడుకు వరుస అయ్యే సాయికి ఫోను చేసి విషయం తెలియజేసి రమ్మన్నాడు. అతనేమో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసుకుంటున్నానని, బయటకు వస్తే పోలీసు వారు వాహనాన్ని స్వాధీన పరచుకుంటారని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. బ్రతిమి లాడటంతో కాసింత మెత్త బడి ఒంటి గంటకు వచ్చాడు. ఈ లోపు వైకుంఠ రథం వచ్చింది, దాంట్లోనే పాడె కట్టే మనిషి సరంజామాతో వచ్చాడు. అర గంటలో కార్యక్రమం పూర్తి చేసారు పంతులు గారు. పాడె కట్టే వ్యక్తి తన పని తాను చేసుకున్నాడు. తీరా చూస్తే శవాన్ని పాడె మీదకు చేర్చడానికి, అటు పిమ్మట వైకుంఠ రథంలో పెట్టడానికి కావలసిన ఆ నులుగురు లేరు. అరవై సంవత్సరాల వయస్సు పైబడిన బంధువులు ఇద్దరు, రామనాధం గారు మరియు తల కొరివి పెట్టే వ్యక్తి మాత్రమే ఉన్నారు. ఓ సామెత ఉంది కనీసం నులుగురితో అయినా బాగుండాలి అని. ఇటువంటి సమయంలో దాని అర్థం స్ఫురిస్తుంది. ఈ మధ్యలో తాను త్వరగా పని ముగించుకొని ఇంటికి వెళ్లాలని, చీకటి అయితే కర్ఫ్యూ వుంటుందని, పోలీసుతో పేచీయని పంతులు గారి హడావిడి. ఆయన సూచన మేరకు రామనాధం గారు, సాయి, ఇద్దరు బంధువులు కలిసి శవాన్ని మొదటగా పాడె మీదకు చేర్చి, ఆ తర్వాత పాడెను వైకుంఠ రథంలోకి చేర్చారు. సీనియర్‌ సిటిజన్స్‌ కావటం వల్ల పాడెను భుజాల మీదకు ఎత్తు కోవడానికి చాలా శ్రమ పడ్డారులే. ఆ సమయంలో ఈ జీవన తరంగాలలో ఎవరికి ఎవరు సొంతం అన్నటువంటి కవి వాక్కు నాకు గుర్తుకొచ్చింది ‘‘. ఆగి మళ్లీ ప్రారంభించాడు శ్రీరామ్‌.

‘‘ కొడుకు కన్నతల్లి చివరి చూపుకు కూడా నోచుకోలేదు. వాట్స్‌ అప్‌ వీడియోలో మాత్రమే చివరి చూపు వారికి దక్కింది. లాక్‌ డౌన్‌ లేకుంటే వచ్చి వుండేవారు. ముందు ముందు ఇండియాకి ఎప్పుడు వస్తారో తెలియదు. భవిష్యత్‌ లో తండ్రి ఎన్ని కష్టాలు పడాలో చెప్ప లేము. ఆయనది చిన్న వయసు కాదు. ఇంట్లోకి పని మనుషులు కూడా రావట్లేదు. ఇంటి పనులు చేసుకోవాలన్నా, వంట చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది. లాక్‌ డౌన్‌ పుణ్యమాని ఇటువంటి సంఘటనలు చాలా వింటున్నాం. డాక్టర్‌ రామనాధం గారికి చాలా పెద్ద బంధు వర్గం ఉంది. ఊరేగింపుగా సాగవలసిన శవ యాత్ర కావలసిన వారు లేకుండానే జరిగి పోయింది లాక్‌ డౌన్‌ కారణంగా. తీరా శ్మశానానికి వెళ్ళిన తర్వాత వాళ్ల గొడవ వాళ్లది. వీళ్లేమో ఏడుస్తూ ఉంటే వాడేమో ఇచ్చిన డబ్బు సరిపోవంటాడు. చివరికి ఏదో విధంగా వదిలించుకోవడమైంది. కర్మను అధిగమించలేమన్న దానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. ఇదో రకం అయితే, అవకాశం వుండి కూడా తల్లిదండ్రులు చనిపోతే విదేశాల నుండి రాని కొడుకులు ఉన్నారు. నా వరకైతే సంబంధ బాంధవ్యాలు రోజు రోజుకు తగ్గి పోతున్నాయని పిస్తోంది. వున్న ఒక కొడుకు లేదా ఇద్దరు కొడుకులు విదేశాల్లో స్థిరపడితే ఇక్కడ వుండే వృద్ధ తల్లిదండ్రుల బాగోగులు ఎవరు చూస్తారు.’’ అన్నాడు శ్రీరామ్‌. శ్రీరామ్‌, మీరు చెప్పేది ఒక విధంగా సమర్ధించ తగ్గదే. కానీ కొన్ని కుటుంబాల్లో కొడుకు విదేశాల్లో స్థిర పడటాన్ని తల్లిదండ్రులు కూడా సమర్థిస్తున్నారు. వారి భవిష్యత్తు కోసం విదేశాల్లో స్థిరపడితే తప్పేమిటి మేము ఏదో వృద్ధాశ్రమంలో వుంటాము అనే వారు కూడా వున్నారు.’’

‘‘ఆ వాదన సమంజసమే కావచ్చు రాజేందర్‌. మనం గమనించవసిన విషయం ఏమిటంటే కొడుకు కూతుళ్ళు విదేశాల్లో స్థిరపడి మూడు లేదా నాలుగు సంవత్సరాల కొకసారి ఇండియాకి వస్తే, తల్లిదండ్రులు, ఇతర దగ్గర బంధువులతో ఏ పాటి బంధం వుంటుందో ఊహించుకోవచ్చు. ఇక్కడ వుండే ఇరవై రోజులు లేదా నెల రోజులు షాపింగ్‌ చేయటం, గుళ్ళు గోపురాలు తిరగటంతో పుణ్యకాలం కాస్తా గడిచి పోతుంది. తల్లిదండ్రులతో గడిపే అవకాశం చాలా తక్కువ. నాకు పరిచయం ఉన్న ఇద్దరు వృద్ధ దంపతులు హైదరాబాదులో ఉండగా వారి ఒక్కగా నొక్క కొడుకు కుటుంబంతో అమెరికా లో స్థిరపడ్డాడు. మూడు సంవత్సరాల తర్వాత వాడిని ఇండియాకు రమ్మంటే వాడేమి చెప్పాడో తెలుసా. మేము దుబాయికి వస్తాం మీరూ అక్కడికి రండి అందరం అక్కడే కలుసుకోవచ్చు అన్నాడు. దానితో వీళ్లు దుబాయి వెళ్లారు. దుబాయ్‌ లో ఒక ఐదు రోజుల పాటు కొడుకు కోడలు షాపింగ్‌ చేశారు. వాళ్లు అమెరికా వెళ్లారు, తల్లిదండ్రులు ఇండియాకు వచ్చారు. ఇదేనా ప్రేమ, అనుబంధం, ఆప్యాయత.’’ ‘‘ పెంచి పెద్దచేసి ఒక మంచి జీవితాన్ని కల్పించిన తల్లిదండ్రుల పట్ల ఈ విధమైన ప్రవర్తన ఎవరూ హర్షించరు. ఏది ఏమైనా మనిషి భవిష్యత్తు జీవితం ఎలా వుంటుందో చెప్పలేం. ఓకే శ్రీరామ్‌, ఉంటాను’’. రాజేందర్‌, శ్రీరామ్‌లు చెరో ఇంటి గేటులోకి వెళ్ళారు.