సఖి కేంద్రం ద్వారా మహిళలు, కౌమార బాలికలకు జాప్యం లేకుండా సహకారం

మహబూబ్నగర్: సఖి కేంద్రం ద్వారా గుర్తించిన ఆపదలో ఉన్న మహిళలు,కౌమార బాలికలకు జాప్యం లేకుండా సహకారం అందించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు అన్నారు. బుధవారం  ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి  వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సఖి మేనేజింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎవరైనా మహిళలు,కౌమార బాలికలు ఆపదలో ఉన్నట్లయితే వారిని ఆదుకునేందుకు  సఖి ద్వారా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఇదివరకే జిల్లా, మండల స్థాయిలో సఖి పై సమావేశాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. అయితే సఖి ద్వారా గుర్తించిన బాధితులకు త్వరితగతిన సహాయం అందించాల్సి ఉందని అన్నారు.  సఖి కేసులను సమీక్షించేందుకు గాను ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లా రెవెన్యూ అధికారి అధ్యక్షతన పోలీసు, రెవిన్యూ మరియు జిల్లా సంక్షేమ అధికారి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో ఈ కమిటీ పనిచేస్తుందని, ప్రతి నెల ఒకటవ తేదీ, 15వ తేదీన సమావేశాలు నిర్వహించి చర్చించాలని ఆయన తెలిపారు. గుర్తించిన ఆపదలో ఉన్న మహిళలకు ఆర్థిక సహకారం అందించేందుకు గాను ఒక ప్రత్యేక ఫండును ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇకపై  సఖి ద్వారా గుర్తించిన  మహిళల సమస్యలన్నింటిని సి విభాగం  ద్వారా పర్యవేక్షించటం జరుగుతుందని ఆయన తెలిపారు వీటిలో బాల్యవివాహాలు కేసులు. ఫోక్సో, భార్య భర్తల కేసులు,బాల్య వివాహాలు, కుటుంబ వ్యవహారాలు ,తదితర అంశాలు వచ్చే అవకాశం ఉన్నందున బాధితులకు త్వరితగతిన సహకారం అందుతుందన్న నమ్మకం కల్పించాల్సి ఉందన్నారు వస్తాయని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా సఖి సెంటర్ ప్రతినిధి మంజుల మాట్లాడుతూ గత మార్చి నుండి ఆగస్టు వరకు జిల్లాలో 111 కేసులు  వచ్చాయని, ఇవి వివిధ దశలలో  ఉన్నాయని, కొంతమందికి కౌన్సిలింగ్ ద్వారా సమస్యను పరిష్కరించడం జరిగిందని వివరించారు. అంతేకాక సఖి ద్వారా జిల్లాలో 18 బాల్యవివాహాలను నిలిపివేసినట్లు ఆమె వెల్లడించారు.సఖి ద్వారా నిర్వహించే కార్యక్రమాలు సజావుగా సాగేందుకు జిల్లాలో పోలీసు, వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ, రేవెన్యూశాఖల ద్వారా సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. అదనపు ఎస్ .పి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ  మిస్సింగ్ కేసులకు సంబంధించి ప్రత్యేకంగా ఒక కానిస్టేబుల్ను ఏర్పాటు చేయడం జరిగిందని ,భార్య భర్తల తగాదాలు, అమ్మాయిల కు సంబంధించిన కేసులు వీటన్నిటికీ సఖి సహకారం తీసుకోవడం జరుగుతుందని, కొంతమందికి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. గత సంవత్సరం జిల్లాలో 59 కేసులు నమోదయ్యాయని దీనికి సంబంధించి ఇప్పటివరకు ఇంకా నష్టపరిహారం అందలేదని త్వరితగతిన పరిహారం ఇచ్చే విషయమై ఆలోచించాలని ఆయన కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ, మహిళ సంక్షేమ శాఖ తదితర శాఖల ద్వారా కేసులకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డి ఆర్ ఓ స్వర్ణలత, జిల్లా సంక్షేమ అధికారి రాజేశ్వరి, డి ఆర్ డి ఓ వెంకట్ రెడ్డి, డి ఈ ఓ ఉషారాణి, ఆమన వేదిక స్వచ్చంద సంస్థ నిర్వాహకులు ఇందిర, నమ్రత తదితరులు హాజరయ్యారు.