ఆటో ఫైనాన్స్‌ కట్టలేక ఆత్మహత్య!

నల్గొండ: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన ఓ ఆటోడ్రైవర్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లాలోని చండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన గడ్డం శ్రీకాంత్ (22) అనే యువకుడు నిన్న సాయంత్రం పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. ఇటీవల ఫైనాన్స్ లో ఆటో కొనుక్కుని శ్రీకాంత్‌ జీవనం సాగిస్తున్నాడు. అయితే, కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆటో నడపకపోవడంతో ఫైనాన్స్ చెల్లింపులు పేరుకుపోయాయి. ఫైనాన్స్‌ నిర్వాహకులు బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో అఘాయిత్యానికి పూనుకున్నాడు. సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకుని పురుగుల మందు తాగి మరణించాడు. ఈ విషయంపై తల్లిదండ్రులు గడ్డం రాములు, వెంకటమ్మ స్థానిక పోలిస్ స్టేషన్‌లో ఫైనాన్స్ సిబ్బందిపై  ఫిర్యాదు చేశారు.