ఎవరైనా అక్రమాలకు పాల్పడితే పి.డి యాక్ట్ నమోదు

మహబూబ్ నగర్: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే బియ్యం విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే పి.డి యాక్ట్ నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుండి పౌరసరఫరాల పై వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సివిల్ సప్లై అధికారులు, తహశీల్దారులు, డిప్యూటీ తాసిల్దార్ లతో సమీక్ష నిర్వహించారు. ముందుగా కలెక్టర్ ఎరువుల సరఫరా పై మాట్లాడుతూ ఈ రోజు లేదా రేపు 800 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేస్తున్నందున  అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా మండలాలలో తాసిల్దార్లు వ్యవసాయ అధికారులతో మాట్లాడి ప్రతి షాప్ దగ్గర ఒక రెవిన్యూ ఇన్స్పెక్టర్ లేదా ఇతర ఉద్యోగులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చౌక ధర దుకాణాల  ద్వారా సరఫరా చేసే బియ్యం విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే పిడి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతి తాసిల్దారు మూడు లేదా  నాలుగు  రెవెన్యూ బృందాలను ఏర్పాటు చేసి చౌకధరల దుకాణాలు తనిఖీ చేయాలని ఆయన తెలిపారు. నూటికి నూరు శాతం చౌకధరల దుకాణాలను తనిఖీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా చౌక ధరల దుకాణాల ద్వారా ఎన్ని నిత్యావసర సరుకులు తీసుకున్నది,పంపిణీ చేసిన సరుకు,స్టాక్ వంటి వివరాలను తనిఖీ చేసి  సమర్పించాలని ఆదేశించారు. గత సంవత్సరం వరి ధాన్యం సేకరణ అత్యంత  ప్రాధాన్యం గా ఉండేదని, ఈ సంవత్సరం  పత్తి సేకరణకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అని  కలెక్టర్ తెలిపారు. ఇందుకుగాను అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు .మండల గ్రామస్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని, ముఖ్యంగా మండల స్థాయిలో  గోదాముల గుర్తింపు, కొనుగోలు కేంద్రాలు,ఇతర   అవసరమైన ఏర్పాట్లకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. త్వరలోనే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రెవెన్యూ, మార్కెటింగ్, వ్యవసాయాధికారుల తో  పత్తి  సేకరణ విషయమై సమావేశాన్ని నిర్వహించ నున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు పై ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని తెలిపారు. పత్తి పరిమాణం రీత్యా  ఎక్కువ స్థలాన్ని ఆక్రమించేందుకు అవకాశం ఉందని,అందువల్ల పెద్ద ఎత్తున నిలువ సామర్త్యాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు. పత్తి కొనుగోలు, యూరియా పంపిణీ, నిత్యావసర సరుకుల పంపిణీ తదితర విషయాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా, మండల స్థాయి అధికారులు ఎలాంటి సెలవులు వినియోగించుకోవద్దని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ సీతారామారావు, డి ఎస్ ఓ  వనజాత,తదితరులు హాజరయ్యారు.