హీరోకు పర్యాయపదం నువ్వు…

ఈ ఫోటో తెగ వైరల్ అయిపోయింది, పాజిటివ్‌గానే..! ఈ కరోనా పీడదినాల్లో ఇంట్లో అంట్లు తోమాను, భార్యకు అట్టు పోశాను, మొక్కలకు నీళ్లు పెట్టాను, గుడ్డుతో ఆమ్లెట్ వేశాను అనే ఫోటోలతో హిహిహి అంటూ వార్తల్లోకి వస్తున్న పెద్ద పెద్ద సెలబ్రిటీలు, వందలు, వేల కోట్లు వెనకేసుకుని కడుపులో చల్లకదలని ఖేల్ రత్నాలు, భారతరత్నాలు, జాతిరత్నాలు, ఇలాంటివేళ నటుడు సోనూ సూద్ కనబరుస్తున్న దాతృత్వం పెద్ద ఎత్తున జనం ప్రశంసలకు కారణమవుతోంది, తను ఒకప్పుడు సినిమాల్లో అవకాశాల కోసం వెతుక్కుంటూ ఓ 420 రూపాయల సీజన్ పాస్ తీసుకుని తిరిగేవాడు… ఆ పాస్, ఆ ఐడీ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్, అవును, ఏమీలేని వాళ్లు తరువాత ఎంతో ఎత్తుకు ఎదిగి, ఎంతో సంపాదించిన కథలు బోలెడు, కానీ సమాజానికి తిరిగి ఏమిచ్చారు అనేదే బతుకు సార్థకతకు లెక్క, సమాజం ఆపదలో ఉన్నప్పుడు ఎలా స్పందించారనేదే అసలు లెక్క, ఆ దిశలో సోనూ సూద్ బతుకు సార్థకం, అంతే… ‘‘ఔదార్యం, సమాజసేవ, దాతృత్వాలకు కొలమానాలు ఉండవు… కానీ సోనూ సూద్ స్పందన, తన తపన ఓ ఉన్మాదంలా కనిపిస్తోంది’’ అని..! ఉన్మాదం అనే పదాన్ని కూడా ఇంత పాజిటివ్ అర్థంలో వాడటం ఇదే తొలిసారి… అది అర్హమైన మాటే అనిపిస్తోంది… ఒక అక్షయ్ కుమార్, ఒక రాఘవ లారెన్స్ తదితర సెలబ్రిటీల దాతృత్వమూ వందశాతం ప్రశంసలకు అర్హమైనవే… కానీ సోనూ సూద్ తీరు వేరు… అది పూర్తిగా ఎక్స్ట్రీమ్ టైపు… ఎక్కడో ఎవరో చిక్కుపడ్డారని తెలిసి, అందరినీ ఓ విమానంలో సొంత ప్రాంతాలకు తరలించడం అంటే మాటలా..? ఇక్కడ డబ్బు ఎంత అనేది ముఖ్యం కాదు… ఒక సమస్య పట్ల స్పందించిన తీరు, తనకు చేతనైనంతలో సాయం చేయటానికి పీక్స్‌కు వెళ్లడం..! నిజమే తను ఏం సంపాదించాడో, ఎంత వెనకేశాడో, గుప్తదానాలు ఎన్ని చేశాడో… ఇప్పటికైతే తనకు చేతనైన దానికి చాలారెట్లు అధికంగా స్పందిస్తున్నాడు… తరలింపు బస్సులు పెడుతున్నాడు, భోజనాలు పెడుతున్నాడు… నిజానికి కోట్లకుకోట్లు సాయం ప్రకటిస్తున్నప్పుడు అక్షయ్‌కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ఆందోళనతో అడిగింది… అఫ్ కోర్స్, అడ్డుపడలేదు… అంతా ఇచ్చేస్తే మనకెలా అని… సింపుల్‌గా మనకేమీ లేనప్పుడు ఈ సమాజం బోలెడంత ఇచ్చింది, ఎంతోకొంత ఇవ్వకపోతే ఎలా అన్నాడు… అల్టిమేట్… హేట్సాఫ్… సేమ్, సోనూ సూద్‌కు దక్కాల్సిన ప్రశంసల్లో అధికభాగం ఆయన భార్యకూ దక్కాలి… ఆమె పేరు సోనాలి… అయ్యో, అయ్యో, ఉన్నదంతా ఊడ్చేస్తున్నావ్, నాకెలా, మనకెలా, మన పిల్లలకెలా, రేపెలా అనే ప్రశ్న రాలేదు… గ్రేట్… సోనూకు అభినందనలు… సోనాలికి కూడా..! ఈ స్ఫూర్తిని ఇలాగే బతుకంతా కాపాడుకుంటారని ఆశిస్తూ… ఎందరెందరికో ‘మోడల్స్’గా ఇలాగే నిలుస్తారని కోరుతూ…