బాలయ్య పంచ్ డైలాగ్ ఆయనకేనా?

నందమూరి బాలకృష్ణ 60వ పుట్టిన రోజు సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను ఒక పవర్ ఫుల్ టీజర్ ను విడుదల చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఒక చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ లో ఒక డైలాగ్ ఉంది. అదేమిటంటే ‘‘ఎదుటివాళ్లతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో, శ్రీను గారూ మీ నాన్నగారు బాగున్నారా? అనేదానికి శ్రీనుగారూ మీ అమ్మ మొగుడు బాగున్నాడా? అనే దానికి చాలా తేడా ఉందిరా లమ్డీ కొడకా’’ అంటూ బాలకృష్ణ తన ఎదురుగా గడ్డంతో ఉన్న విలన్ ను చితక్కొడతాడు. బీబీ3 ఫస్ట్ రోర్ (బాలయ్య బోయపాటి 3 మొదటి గర్జన) అనేది టీజర్ కు ఎండ్ టైటిల్ గా ఉంది. చిత్రం సంగతి ఏమో గానీ ఇప్పుడు ఈ డైలాగ్ బాలకృష్ణ ఎవరిని ఉద్దేశించి అన్నాడు? అనేది పెద్ద టాపిక్ గా మారింది. పొలిటికల్ పంచ్ ఉన్న ఈ డైలాగ్ ఎవరిని ఉద్దేశించి అన్నాడో తెలుసుకోవడానికి పలువురు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వైసీపీకి చెందిన ఒక నేత తరచూ తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి బూతులు మాట్లాడుతూ ఉన్నాడు. ‘‘ సన్న బియ్యం ఎవడు ఇస్తానన్నాడు నీయమ్మ మొగుడా?’’ అని ఒక సారి, ‘‘తిరుమల నీ యమ్మ మొగుడు కట్టించాడా?’’ అని మరొకసారి ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. చాలా సందర్భాలలో ‘‘నీ యమ్మ మొగుడు’’ అనేది ఆయనకు ఊతపదంగా మారింది కూడా. ఆ నాయకుడిని ఉద్దేశించి బాలకృష్ణ ఈ పవర్ ఫుల్ డైలాగ్ అన్నాడా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.